కీర్తన 81
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన.
మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి;
యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!
సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి.
మధురంగా సితారా వీణ మీటండి.
 
అమావాస్య దినాన కొమ్ము ఊదండి,
పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి;
ఇశ్రాయేలీయులకు ఇది శాసనం;
ఇది యాకోబు దేవుడు ఇచ్చిన నియమము.
దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు,
ఆయన దానిని యోసేపుకు శాసనంలా స్థాపించారు.
 
తెలియని స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:
 
“నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను;
వారి చేతులు గంపలెత్తుట నుండి విడిపించబడ్డాయి.
మీ బాధలో మీరు మొరపెట్టగా నేను మిమ్మల్ని రక్షించాను,
ఉరుములతో కూడిన మేఘంలో నుండి నేను మీకు జవాబు ఇచ్చాను;
మెరీబా జలాల దగ్గర నేను మిమ్మల్ని పరీక్షించాను.
సెలా
నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను
ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట మాత్రం వింటే ఎంత మేలు!
మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు;
మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు.
10 నేను మీ దేవుడనైన యెహోవాను,
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను.
మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను.
 
11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు;
ఇశ్రాయేలు నాకు లోబడలేదు.
12 కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు!
నేను వారి మొండి హృదయాలకు వారిని అప్పగించాను.
 
13 “నా ప్రజలు నా మాట మాత్రమే వింటే,
ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే,
14 అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని,
వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని!
15 యెహోవాను ద్వేషించేవారు ఆయన ఎదుట భయంతో దాక్కుంటారు,
వారి శిక్ష శాశ్వతంగా ఉంటుంది.
16 కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను;
బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.”