కీర్తన 84
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన.
1 సైన్యాల యెహోవా,
మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!
2 యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని,
నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది;
సజీవుడైన దేవుని కోసం
నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.
3 సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా,
మీ బలిపీఠం దగ్గరే,
పిచ్చుకలకు నివాసం దొరికింది,
వాన కోయిలకు గూడు దొరికింది,
అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది.
4 మీ మందిరంలో నివసించేవారు ధన్యులు;
వారు నిత్యం మిమ్మల్ని స్తుతిస్తారు.
సెలా
5 మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు,
వారి హృదయాలు సీయోనుకు వెళ్లే రహదారుల మీదే ఉంటాయి.
6 వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు,
వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు;
తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో*లేదా కొలనూలు కప్పివేస్తుంది.
7 వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు
వారి బలం అధికమవుతుంది.
8 సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి;
యాకోబు దేవా, ఆలకించండి.
సెలా
9 మా డాలువైన†లేదా ప్రభువా ఓ దేవా! మా వైపు చూడండి;
మీ అభిషిక్తునిపై దయ చూపండి.
10 బయట గడిపిన వెయ్యి దినాలకంటే
మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు.
దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే
నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.
11 యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు;
యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు;
నిందారహితులుగా నడుచుకునే వారికి
ఆయన ఏ మేలు చేయకుండ మానరు.
12 సైన్యాల యెహోవా,
మీయందు నమ్మకముంచే మనుష్యులు ధన్యులు.