కీర్తన 85
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు;
యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.
మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు
వారి పాపాలన్నీ కప్పివేశారు.
సెలా
మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు
మీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు.
 
మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి.
మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి.
ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా?
తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా?
మీ ప్రజలు మీలో ఆనందించేలా
మీరు మమ్మల్ని మరల బ్రతికించరా?
యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి,
మీ రక్షణ మాకు అనుగ్రహించండి.
 
దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను;
ఆయన తన ప్రజలకు, నమ్మకమైన దాసులకు సమాధానాన్ని వాగ్దానం చేస్తారు;
అయితే వారు బుద్ధిహీనత వైపు తిరుగకుందురు గాక.
మన దేశంలో ఆయన మహిమ నివసించేలా,
ఆయనకు భయపడేవారికి ఆయన రక్షణ ఎంతో సమీపంగా ఉంటుంది.
 
10 మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి;
నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి.
11 నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది,
నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.
12 యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు,
మన భూమి తన పంటనిస్తుంది.
13 ఆయనకు ముందుగా నీతి వెళ్తూ
ఆయన అడుగు జాడలకు మార్గం సిద్ధం చేస్తుంది.