కీర్తన 96
యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి;
సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి.
యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి;
అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
దేశాల్లో ఆయన మహిమను,
సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
 
యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు;
దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు,
కాని యెహోవా ఆకాశాలను సృజించారు.
వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి;
బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి.
 
ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి,
మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి.
అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి.
తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి;
సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.
10 “యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి,
లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు;
ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు.
 
11 ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి;
సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి.
ఆయన మహిమను ప్రచురించాలి.
12 పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి.
అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి.
13 యెహోవా రాబోతున్నారు.
భూలోకానికి తీర్పు తీరుస్తారు.
నీతిని బట్టి లోకానికి,
తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.