కీర్తన 97
యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది;
ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి.
ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి;
ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు.
ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి
చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి.
ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి;
అది చూసి భూమి కంపిస్తుంది.
యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి,
ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.
ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి,
ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు.
 
వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ,
చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు
సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!
 
యెహోవా! మీ తీర్పులను బట్టి
సీయోను విని సంతోషిస్తూ ఉంది
యూదా కుమార్తెలు*ఇక్కడ, కుమార్తెలు గ్రామాలకు వర్తిస్తుంది. ఆనందిస్తున్నారు.
యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు;
దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు.
10 యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక,
ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు
దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.
11 నీతిమంతుల మీద వెలుగు
యథార్థవంతుల మీద ఆనందం ప్రకాశిస్తాయి.
12 నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి,
ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.

*కీర్తన 97:8 ఇక్కడ, కుమార్తెలు గ్రామాలకు వర్తిస్తుంది.