అయిదవ గ్రంథము
107
కీర్తనలు 107–150
1 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు;
ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.
2 యెహోవాచేత విమోచింపబడినవారు,
విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు,
3 వివిధ దేశాల నుండి, తూర్పు పడమర,
ఉత్తర దక్షిణాల*హెబ్రీలో దక్షిణాల సముద్రాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.
4 కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు;
నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు.
5 వారు ఆకలి దప్పికతో ఉన్నారు,
వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి.
6 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు,
ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు.
7 ఆయన వారిని తిన్నని బాటలో
నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు.
8 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
9 దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు,
మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.
10 కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి,
చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు,
11 వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి,
మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు.
12 కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు;
వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు.
13 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు,
ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
14 ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు,
వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు.
15 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
16 ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు
ఇనుప గడియలను విరగ్గొడతారు.
17 కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు
వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.
18 వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు
మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు.
19 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు,
ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
20 తన వాక్కును పంపి
దేవుడు వారిని స్వస్థపరిచాడు.
21 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
22 కృతజ్ఞతార్పణలు అర్పించాలి.
ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.
23 ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ మహాజలాల మీద వెళుతూ,
కొందరు వ్యాపారం చేస్తారు.
24 వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు,
సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు.
25 దైవాజ్ఞకు తుఫాను లేచింది,
అలలు రేగాయి.
26 వారు ఆకాశానికి పైకి ఎక్కారు, జలాగాధంలోకి దిగిపోయారు;
వారి జీవం దురవస్థ చేత కరిగిపోయింది.
27 వారు త్రాగుబోతుల్లా తూలుతూ, అటూ ఇటూ ఊగుతూ ఉన్నారు;
వారు తెలివి తప్పి ఉన్నారు.
28 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు
ఆయన వారిని వారి బాధ నుండి విడిపించారు.
29 అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు,
సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.
30 అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు.
వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు.
31 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
32 ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ.
పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి!
33-34 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి,
ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు.
మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు.
సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు.
35 అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి.
ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది.
36 ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు,
వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు.
37 వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు.
ఫలసాయం బాగా దొరికింది.
38 దేవుడు వారిని ఆశీర్వదించాడు.
వారు అధికంగా అభివృద్ధి చెందారు.
పశుసంపద ఏమాత్రం తగ్గలేదు.
39 వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము.
వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది.
40 సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు
వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు.
41 కానీ ఆయన అవసరతలో ఉన్నవారిని వారి కష్టాల నుండి పైకి లేవనెత్తారు
గొర్రెల మందల్లా వృద్ధి వారి కుటుంబాలు వృద్ధిచేశారు.
42 యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము.
దుష్టులంతా నోరు మూసుకోవాలి.
43 జ్ఞానులు ఈ విషయాలను ఆలోచిస్తారు,
యెహోవా ప్రేమా క్రియలను తలపోస్తారు.