కీర్తన 108
ఒక గీతము. దావీదు కీర్తన. 
  1 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది;  
నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను.   
 2 సితారా వీణా, మేలుకోండి!  
ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.   
 3 యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను;  
జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.   
 4 ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది;  
మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.   
 5 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి;  
భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.   
 6 మీరు ప్రేమించేవారు విడిపించబడేలా,  
మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.   
 7 దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట:  
“విజయంతో నేను షెకెమును పంచుతాను  
సుక్కోతు లోయను కొలుస్తాను.   
 8 గిలాదు నాది, మనష్షే నాది;  
ఎఫ్రాయిం నా శిరస్త్రాణం,  
యూదా నా రాజదండం.   
 9 మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం,  
ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను;  
ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”   
 10 కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు?  
ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?   
 11 దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా?  
మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?   
 12 శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి,  
ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.   
 13 దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం,  
ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.