కీర్తన 139
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. 
  1 యెహోవా మీరు నన్ను పరిశోధించారు,  
మీరు నన్ను తెలుసుకొన్నారు.   
 2 నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు;  
దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.   
 3 నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు;  
నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.   
 4 యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే,  
అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.   
 5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు,  
మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.   
 6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది,  
నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది.   
 7 మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను?  
మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను?   
 8 ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు;  
నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు.   
 9 ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి,  
నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే,   
 10 అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది,  
మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది.   
 11 “చీకటి నన్ను దాచివేస్తుంది,  
నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే,   
 12 చీకటి కూడ మీకు చీకటి కాదు;  
రాత్రి పగటివలె మెరుస్తుంది,  
ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.   
 13 నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;  
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.   
 14 నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.  
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,  
అది నాకు పూర్తిగా తెలుసు.   
 15 రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,  
భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,  
నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.   
 16 నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;  
నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే  
అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.   
 17 దేవా, మీ ఆలోచనలు*నా గురించిన మీ ఆలోచనలు ఎంత అద్భుతం! నాకెంతో అమూల్యమైనవి!  
వాటి మొత్తం ఎంత విస్తారమైనది!   
 18 వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే,  
అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి,  
నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను.   
 19 ఓ దేవా, మీరే దుష్టులను హతం చేస్తే మంచిది;  
హంతకులారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి.   
 20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు;  
మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు.   
 21 యెహోవా, మిమ్మల్ని ద్వేషించేవారిని నేను ద్వేషించనా,  
మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని అసహ్యించుకోనా?   
 22 వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు;  
వారిని నా శత్రువులుగా లెక్కగడతాను.   
 23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి;  
నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి.   
 24 చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి,  
నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.†కీర్తన 3:8 ఫుట్‌నోట్ చూడండి