కీర్తన 140
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
1 యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి;
హింసించేవారి నుండి నన్ను కాపాడండి,
2 వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు
రోజు యుద్ధము రేపుతారు.
3 వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు;
వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.
సెలా
4 యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి;
దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి,
నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.
5 అహంకారులు చాటుగా వల ఉంచారు;
వారు వల దాడులు పరచారు,
నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు.
సెలా
6 నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను.
యెహోవా, దయతో మొరను ఆలకించండి.
7 ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా,
యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.
8 యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి;
వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి.
సెలా
9 నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు;
వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి.
10 మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి;
వారు అగ్నిలో పడవేయబడాలి,
తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి.
11 దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక;
విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి.
12 యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని,
అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.
13 నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు,
యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.