3
నూర్పిడి కళ్లం దగ్గర రూతు, బోయజు
1 ఒక రోజు రూతు అత్తయైన నయోమి, “నా కుమారీ, నేను నీకోసం ఒక ఇంటిని*హెబ్రీలో విశ్రాంతి కనుగొనడం (1:9 చూడండి) వెదకాలి, అక్కడ నీకు మంచి జరుగుతుంది. 2 నీవు ఎవరి పనికత్తెలతో పని చేస్తున్నావో, ఆ బోయజు మనకు బంధువు. ఈ రాత్రి అతడు నూర్పిడి కళ్ళంలో యవలు చెరిగిస్తూ ఉంటాడు. 3 నీవు స్నానం చేసి నూనె రాసుకుని మంచి బట్టలు కట్టుకుని ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లు. అతడు భోజనం చేసే వరకు నీవు అక్కడ ఉన్నావని అతనికి తెలియనీయకు. 4 అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు. తర్వాత లోపలికి వెళ్లి, అతని కాళ్లమీద ఉన్న బట్ట తీసి పడుకో. నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు” అని చెప్పింది.
5 అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది. 6 కాబట్టి ఆమె ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లి, తన అత్త చెప్పినదంతా చేసింది.
7 బోయజు తృప్తిగా భోజనం చేసి పడుకోడానికి ధాన్యం కుప్ప దగ్గరకు వెళ్లాడు. రూతు మెల్లగా వెళ్లి, అతని కాళ్ల మీదున్న దుప్పటి తీసి పడుకుంది. 8 మధ్యరాత్రి అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్ల దగ్గర పడుకుని కనిపించింది.
9 “ఎవరు నీవు?” అని అతడు అడిగాడు.
రూతు జవాబిస్తూ, “నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి” అన్నది.
10 అతడు, “నా కుమారీ, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు చూపించే ఈ మంచితనం ఇంతకుముందు కన్నా ఇంకా గొప్పది: ధనికులైనా పేదలైనా సరే, నీవు ఏ యువకుల వెంటపడలేదు. 11 నా కుమారీ, భయపడకు. నీవు అడిగినదంతా నీకు చేస్తాను. నీవు గుణవతివని నా పట్టణంలో ఉన్న ప్రజలందరికి తెలుసు. 12 నేను నిన్ను విడిపించగల సమీపబంధువును అనే సంగతి నిజమే కాని, నా కంటే సమీపబంధువు ఒకడు ఉన్నాడు. 13 ఈ రాత్రి ఇక్కడ ఉండు, ప్రొద్దున అతడు నీకు బంధువుని ధర్మం జరిగిస్తే మంచిది; అతడు నిన్ను విడిపిస్తాడు. అయితే అతడు ఒప్పుకోకపోతే, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడిపిస్తాను. ఉదయం వరకు ఇక్కడ పడుకో” అని చెప్పాడు.
14 కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకుని, ఇంకా ఒకనిని ఒకరు గుర్తుపట్టేటంత వెలుగు రాకముందే లేచింది; “ఒక స్త్రీ నూర్పిడి కళ్ళం లోనికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు” అని బోయజు అన్నాడు.
15 అంతేకాక, “నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో” అని చెప్పాడు. ఆమె అలా చేసినప్పుడు, అతడు ఆరు కొలతల†అంటే, 25 కి. గ్రా. లు యవలను పోసి ఆమెపై పెట్టాడు. తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్లాడు.
16 రూతు తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, నయోమి, “నా కుమారీ, నీవు వెళ్లిన పని ఏమైంది?” అని అడిగింది.
అప్పుడు ఆమె బోయజు తన కోసం చేసినదంతా చెప్పింది. 17 అంతేకాక, “ ‘నీవు వట్టి చేతులతో నీ అత్త దగ్గరకు వెళ్లకు’ అని చెప్తూ, అతడు ఈ ఆరు కోలల యవలను నాకిచ్చాడు” అని చెప్పింది.
18 అపుడు నయోమి, “నా కుమారీ, ఏమి జరుగుతుందో నీవు తెలుసుకునే వరకు వేచి ఉండు. ఈ సంగతి ఈ రోజు తేలేవరకు ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకోడు” అని అన్నది.