4
బోయజు రూతుల పెళ్ళి 
  1 బోయజు పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చున్నప్పుడు, అతడు చెప్పిన సమీపబంధువు అక్కడికి వచ్చాడు. “నా స్నేహితుడా, ఇక్కడకు వచ్చి కూర్చో” అని బోయజు అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి కూర్చున్నాడు.   
 2 బోయజు ఆ పట్టణ పెద్దలలో పదిమందిని తీసుకుని వచ్చి, “ఇక్కడ కూర్చోండి” అని చెప్పాడు, వారు కూర్చున్నారు.   3 అతడు ఆ బంధువుతో అన్నాడు, “మోయాబు నుండి తిరిగివచ్చిన నయోమి, మన బంధువైన ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మి వేస్తుంది.   4 ఈ విషయం నీ దృష్టికి తీసుకురావాలని, నీవు నా ప్రజల పెద్దల ఎదుట దానిని కొనాలని నేను అనుకున్నాను. నీవు విడిపిస్తే విడిపించు. కాని ఒకవేళ నీవు విడిపించకపోతే నాకు చెప్పు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికీ ఆ హక్కు లేదు, నీ తర్వాత నేను ఉన్నాను.”  
“నేను విడిపిస్తాను” అని అతడు అన్నాడు.   
 5 అప్పుడు బోయజు అన్నాడు, “నయోమి దగ్గర నీవు ఆ భూమిని కొన్న రోజు, చనిపోయిన వాని భార్య, మోయాబీయురాలైన రూతు నీకు చెందుతుంది, ఈ విధంగా చనిపోయిన వాని స్వాస్థ్యంతో అతని సంతతిని నిలబెడతావు.”   
 6 ఇది విని, ఆ బంధువు, “అయితే నేను దానిని విడిపించలేను, ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోలిపోతానేమో. నీవే దానిని విడిపించు. నేను చేయలేను” అని అన్నాడు.   
 7 (ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)   
 8 కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.   
 9 అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.   10 అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”   
 11 అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.   12 యెహోవా ఈ యువతి ద్వారా నీకు ఇచ్చే సంతానం ద్వారా, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు వలె ఉండును గాక!” అని అన్నారు.   
కుమారుని పొందిన నయోమి 
  13 బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది.   14 అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు: “ఈ రోజున నిన్ను విడిపించే సమీపబంధువు ఉండేలా చేసిన యెహోవా స్తుతినొందును గాక. ఇశ్రాయేలులో అతనికి ఖ్యాతి కలుగును గాక!   15 అతడు నీ జీవితాన్ని నూతనపరచి, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే, ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు, అతనికి జన్మనిచ్చింది.”   
 16 నయోమి ఆ బాలున్ని తన చేతుల్లోకి తీసుకుని వానికి దాదిగా ఉన్నది.   17 అక్కడ నివసిస్తున్న ఆమె పొరుగు స్త్రీలు, “నయోమికి కుమారుడు ఉన్నాడు!” అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. అతడు దావీదు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి.   
దావీదు వంశావళి 
  18 ఇది పెరెసు వంశావళి:  
పెరెసు కుమారుడు హెస్రోను   
 19 హెస్రోను కుమారుడు రాము.  
రాము కుమారుడు అమ్మీనాదాబు,   
 20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.  
నయస్సోను కుమారుడు శల్మాను.   
 21 శల్మాను కుమారుడు బోయజు,  
బోయజు కుమారుడు ఓబేదు.   
 22 ఓబేదు కుమారుడు యెష్షయి.  
యెష్షయి కుమారుడు దావీదు.