6
చెలికత్తెలు
స్త్రీలలో అత్యంత అందమైనదానా,
నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు?
నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు
మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి.
యువతి
నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు,
పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు,
తోటలో మందను మేపడానికి,
తామరలను ఏరుకోడానికి.
నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు;
తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.
యువకుడు
నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు,
యెరూషలేములా మనోహరంగా ఉన్నావు,
జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.
నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు;
అవి నన్ను వశపరచుకుంటాయి.
నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి
దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.
నీ పళ్ళు అప్పుడే కడుగబడి పైకి వస్తున్న
గొర్రె మందలా ఉన్నాయి.
ప్రతిదీ జంటగా ఉన్నాయి.
వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు,
విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి.
అరవైమంది రాణులు,
ఎనభైమంది ఉంపుడుగత్తెలు,
అసంఖ్యాకులైన కన్యకలు ఉండవచ్చు;
కాని నా పావురం, నా అందాలరాశి, ఒకతే,
తన తల్లికి ఒక్కగానొక్క కుమార్తె,
తనను కన్నదానికి ఇష్టమైనది.
యువతులు ఆమెను చూసి ఆమెను ధన్యురాలు అని పిలిచారు;
రాణులు ఉంపుడుగత్తెలు ఆమెను ప్రశంసించారు.
చెలికత్తెలు
10 తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా,
సూర్యునిలా ప్రకాశవంతంగా,
నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?
యువకుడు
11 లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు
లోయలో నూతన చిగురులను చూడాలని,
ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో,
దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.
12 నేను గ్రహించేలోపే,
నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది.
చెలికత్తెలు
13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా;
తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా!
యువకుడు
మహనాయీము నాట్యాన్ని చూసినట్లు
మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?