కీర్తన 121
యాత్రకీర్తన.
1 కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను,
నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?
2 ఆకాశాన్ని భూమిని సృజించిన
యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.
3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు,
నిన్ను కాపాడేవాడు కునుకడు.
4 నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు
కునుకడు న్రిదపోడు.
5 యెహోవా నిన్ను కాపాడతారు,
యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.
6 పగటివేళ సూర్యుడు కాని లేదా,
రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.
7 సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు
ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
8 ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో
యెహోవా నిన్ను కాపాడును.