కీర్తన 129
యాత్రకీర్తన.
“నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు”
అని ఇశ్రాయేలు అనాలి;
“నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు,
కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.
దున్నువారు దున్నినట్లు
నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.
అయితే యెహోవా నీతిమంతుడు;
దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”
 
సీయోనును ద్వేషించే వారందరు
సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.
వారు ఎదగక ముందే ఎండిపోయిన
ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక.
దానితో కోత కోసేవారు తమ చేతిని గాని
పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.
“యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక;
యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము”
అని బాటసారులు అనకుందురు గాక.